Devi Kathalu         Chapters          Last Page

సత్యవ్రతుడు

కోసల దేశములో దేవదతద్తుడనే వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలనూ ఆకళింపు చేసికొని, ప్రశాంత జీవనం గుడుపుతూ వచ్చాడు. నగరంలోని సంపన్నుల ఆదరాభిమానాలకు పాత్రుడైన అతనికి సంపదల విషయంలో కూడా ఏ లోటూ లేదు. కాని, సంతానం లేక అసంతృప్తితో అలమటించి పోయేవాడు దేవదత్తుడు.

ఒకనాడు అతడు తనలో తాను విచారించ సాగాడు. ఏ జన్మలోనో తాను చేసిన పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయినదని విలపించాడు. ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత, యజ్ఞాదుల చేత, దానధర్నాల చేత అధిగమించవచ్చు. సంచిత కర్మలను దైవప్రార్థనల చేత , తీర్థయాత్ర చేత, పుణ్యకర్మాచరణం చేత, సత్యవాక్పాలనం చేత జయించవచ్చు, కాని ప్రారబ్ధకర్మను ఎంతటి వారికైనా అనుభవింపక తప్పదు కదా
! అనుకుంటూ, ఇంత వరకు పాపఫలాన్ని అనుభవించిన తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తి ని పొంద గలనని సంకల్పించాడు దేవదత్తుడు.


ఒక సుముహూర్తాన దేవదత్తుడు తమసానదీ తీరంలోఒక వేదికను నిర్మించుకొని, వేదవేదాంగ విదులైన బ్రాహ్మణులను పిలిపించి యాగం ప్రారంభించాడు. పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్న యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింప చేయవలసినదని, తాను పుష్కలంగా దక్షిణలిచ్చి, సంతోష పెట్టగలనని వేదవిప్రులకు విన్నవించాడు. గోభిలుడు ఉద్గాతగా, బృహస్పతి హూతగా, యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా యజ్ఞం ప్రారంభ##మైంది.

యజ్ఞం జరుగుతూ ఉండగా, ఉద్గాత అయిన గోభిలుడు మంత్రోచ్ఛారణ చేస్తూండగా, మధ్యలో శ్వాస అడ్డువచ్చి స్వరభంగం కలిగింది. దేవదత్తుడు ఎంతో బాధపడి "మహాత్మా ! పుత్రార్థినై నేను చేస్తున్న ఈ యజ్ఞంలో మీరు పలికిన అపస్వరం వల్ల నాకు సత్ఫలితం లేకుండా పోతుంది. నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణం సాగించండి" అని కోరాడు. దేవదత్తుని మాటలకు గోభిలుడు కోపగించాడు. "శ్వాస పీల్చే వేళలో వచ్చిన స్వరములోని మార్పుని దోషంగా భావించి నన్ను అవమానించావు. ప్రతి ప్రాణికీ ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు సహజం కదా! అవి మానవ ప్రయత్నం చేత నివారింప బడేవికావు. అయినా. చేయని తప్పును నా పై మోపి నన్ను అవమానించావు. కనుక నీకు పుట్టబోయే కుమారుడు విద్యావిహీనుడై ముర్ఖుడగు గాక!" అని శపించాడు గోభిలుడు.

శాపం వింటూనే దేవదతేతుడు గొల్లున ఏడ్చాడు, జన్మించబోయే కొడుకు మూర్ఖుడైతే, జీవితమంతా దుఃఖమయమే కదా !దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేక

పోయాడు. "మహాత్మా! మీరు ఇలా శపించడం న్యాయమేనా? మూర్ఖుడైన పుత్రుణ్ణి పొందడం కంటే పుత్రులు లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా ! బ్రాహ్మణునికి విద్యయే సర్వస్వం కదా ! విద్యావిహీనుడు, మూడ్ఢుడు అయిన బ్రాహ్మణుడు సర్వత్రా నిరాదరింప బడతాడు కదా ! ప్రపంచంలో మార్ఖత్వం మరణం కంటే నీచమైనది కదా ! కనుక, నాకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించి, నన్ను అనుగ్రహించండి. " అని ప్రార్థించాడు.

దేవదత్తుని దీనాలాపాలకు గోభిలుని మనస్సు కరిగిపోయింది ఉత్తముని కోపం క్షణకాలమే కదా ! సామాన్యుని కోపం రెండు ఘడియల కాలం ఉంటుంది. అధముని కోపం రోజంతా ఉంటుంది. పాపాత్ముని కోపం జీవితమంతా కొనసాగుతుంది. వేద విద్యా సంస్కారంతో పునీతమైన మనస్సు గల గోభిలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నాడు. కోపాన్ని వదలి శాంతించాడు. " నా శాపం వల్ల నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైనా, తరువాత తప్పక మహావిద్వాంసుడు కాగలడ " ని అభయమిచ్చాడు.

కొంత కాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మించాడు. తండ్రి అతనికి ఉత్యథుడని నామకరణం చేశాడు. దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేదవిద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపించాడు. గురువు ఎంతగా బోధించినా ఉతథ్యునికి విద్య అబ్బలేదు. మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధా కాలయాపన చేయసాగాడు.

అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచింది. ఉతథ్యునకు సంధ్యావందనం అలవడలేదు. చదువు అసలే అంటలేదు. వేదవిద్య అతనికి అందని మ్రాని పండే అయింది. ఉతథ్యుణ్ణి చూచి తోటిబాలురు పరిహాసం చేయసాగారు. తల్లిదండ్రులు కూడా ఉతథ్యుని మూర్ఖత్వానికి బాధపడేవారు. ఇలా అందరూ తనను ఏవగించు కోవడం, చులకనగా చూడడం ఉతథ్యుణ్ణి ఆవేదనకు, తర్వాత ఆలోచనకు గురిచేసింది. అతడు ఎవ్వరికీ చెప్పకుండా గంగా తీరానికిచేరి, ఒకచోట కూర్చొని తనలో తాను ఏదో విత్కరించు కోవడం ప్రారంభించాడు. 'నిత్యమూ సత్యమునే పలుకుతాన'ని సంకల్పించి, నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు.

ఉతథ్యునిలో నానాటికీ అంతర్మథనం తీవ్రతరం అయింది.

"నన్ను చదివించి విద్యావంతుణ్ణి చేయాలని, నా తల్లిదండ్రులు భావించారు. గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించినా, నాకు విద్యాగంధం బొత్తిగా అంటక పోవడం దైవయోగం తప్ప మరేమీ కాదు. బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరర్థకమైంది పూర్వజన్మలో సరస్వతీ దానంగా ఏ బ్రాహ్మణునికీ నేను గ్రంథాలను దానం చేయలేదేమో! ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని . తిరిగి ఇవ్వకుండా, లోభంతో ప్రవర్తించి. తిరిగి ఇచ్చానని అసత్యం పలికానేమో! సరస్వతీ స్వరూపమైన గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో! సభల్లో పండితులను పరిహసించానేమో! పండితుడనేగర్వంతో ఎవ్వరినీ లెక్కచేయకుండా, ఎవ్వరికీ విద్యా దానము చేయకుండా విఱ్ఱ వీగుతూ, కాలం గడిపి ఉంటాను. ఇదంతా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది. మానవుని సంకల్పం దైవబలంచేత వ్యర్థమవుతుంది. త్రిమూర్తులైనా కాలానికి లొంగి పోవలసిన వారే. సత్యవ్రతము గొప్పదని పెద్దలు చెప్తున్నారు. సత్యవ్రతాన్ని స్వీకరించి, అరణ్యంలో ఏకాంతంగా జీవనం సాగిస్తాను." అని ఉతథ్యుడు తనలో తాను నిర్ణయించుకొన్నాడు.

ఇలా కృతనిశ్చయుడై ఉతథ్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా, ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ, తరుముకొంటూ వెళ్ళాడు. ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి'' '' అను ధ్వని వెలువడగా విని, ఆ శబ్దము వింతగా ఉన్నదను కొని ఉతథ్యుడు ఆశబ్దాన్నే మాటిమాటికీ పలుమారులు ఉచ్చరించాడు.

ఉతథ్యుని సతవ్రత దీక్షను పరీక్షించాలని భావించిన ఆదిపరాశక్తి శివుణ్ణి కిరాతరూపంలో ఉతథ్యుడున్న ప్రదేశానికి పంపించింది. ఆ మాయా కిరాతుడు పందిని తరుముతూ రాగా, పంది ఉతథ్యుని ఎదురుగానే కిరాతుణ్ణి తప్పించుకొని పోయింది. వెనుక వచ్చిన కిరాతుడు పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ఉతథ్యుడు కోరాడు. తనకు, తన కుటుంబానికి ఆకలి తీరి, ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని, కనుక, దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకొని , తమ ప్రాణాలను రక్షించవలసిందిగా ఆర్థించాడు.

ఉతథ్యుడు మీమాంసలో పడ్డాడు. పందిజాడ చేప్తే , కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు. తన సత్యవ్రత దీక్షవల్ల హింస జరుగుతుంది. చెప్పకపోతే తనకు అసత్యదోషం సంక్రమిస్తుంది. సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది. అహింసకు ప్రాధాన్యమిస్తే సత్యవ్రతం భంగమవుతుంది. ఉతథ్యునికి కర్తవ్యం

స్ఫురించలేదు. ఒక్కక్షణం ఆలోచించి" ఓయీ! కిరాతుడా !వరాహం జాడ చెప్పమంచున్నావు కదా! చూచేది కన్ను. దానికి చెప్పే శక్తిలేదు. పలికేది నోరు. దానికి చూడగల లక్షణం లేదు. చూచేది ఒకరు, చెప్పేది మఱొకరు. అందువల్ల నీకు లాభంలేదు. "అన్నాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాతరూపంలో ఉన్న పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు. పరాశక్తి ఆరాధనకు సంబంధించిన వాగ్భవ బీజమైన "" అను అక్షరములోని అర్థభాగమైన '' '' అను ధ్వనిని పలుమార్లు ఉచ్చరించిన పుణ్యఫలంగా ఉతథ్యునికి వాగ్భాప బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి, అంతర్థాన మయ్యాడు పరమేశ్వరుడు.

ఉతథ్యుడు జగన్మాతను వాగ్భవ బీజంతో ఆరాధించి, ఆమె కరుణా కిరమ ప్రసారంచేత "సత్యవ్రతుడు"గా ప్రఖ్యాతిని పొంది, మహా విద్వాంసుడై పరమేశ్వరీ పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు.

పరాశక్తి మంత్రాక్షరంలో అర్థబాగాన్ని తెలియకుండా ఉచ్ఛరించిన మాత్రాననే ఆమో అనుగ్రహం కలిగినపుడు, సంపూర్ణంగా యథావిథిగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగే సత్ఫలితం ఎంతటిదో ఆలోచించ వలసినదని సూతుడు శౌనకాది మహామునులకు వివరించాడు.

సత్యవ్రతుని కథను చదివినా , విన్నా పరమేశ్వరి అనుగ్రహం వల్ల అలాంటి వారికి పాండిత్యం ఆలోచనా శక్తి కలుగుతాయని ఫలశ్రుతి ని

అనుగ్రహిస్తూ సూతుల వారు ఈ ఉపఖ్యానాన్ని ముగించారు.

Devi Kathalu         Chapters          Last Page